తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. కరోనా నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజన్ వ్యాధులతో పోరాడాలని అన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని.. ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. వర్షాల కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లో 516, మిగతా కేసులు కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. మలేరియా కేసులు కూడా నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రిలో 115, ములుగులో 113, భూపాలపల్లిలో 4, ఆసిఫాబాద్‌లో 3, నల్గొండలో 5 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు సైతం ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఈ నెలలో 6 వేల విరేచనాల కేసుల నమోదయ్యాయని చెప్పారు.
సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు 'ఫ్రై డే - డ్రై డే' కార్యక్రమం చేపట్టాలన్నారు. మంచి ఆహారం, నీరు తీసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, విరేచనాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలన్నారు. చిన్న సమస్యలే కదా అని తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.