ఊహించని షాక్.. ఫిబ్రవరి 8కి వాయిదా

గవర్నర్ కోటా కింద కొత్తగా నియమితులైన శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ప్రమాణ స్వీకారాన్ని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

By Medi Samrat  Published on  30 Jan 2024 7:04 PM IST
ఊహించని షాక్.. ఫిబ్రవరి 8కి వాయిదా

గవర్నర్ కోటా కింద కొత్తగా నియమితులైన శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ప్రమాణ స్వీకారాన్ని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. అయితే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళి సై సెప్టెంబర్ 19న తిరస్కరించారు. దీనిపై దాసోజు, కుర్ర సత్యనారాయణలు హైకోర్టు ను అశ్రయించారు. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టికల్ 171 ప్రకారం బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నామినేషన్ చట్టబద్ధమైనదని, దానిని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని బీఆర్‌ఎస్ నాయకులు కోర్టులో వాదించారు.

ఈ పిటిషన్‌పై పది రోజుల కింద విచారణ జరిగింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేద‌ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అనుమతి లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ.. తదుపరి విచారణ హైకోర్టు వాయిదా వేసింది. త‌మ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ కోటాలో కోదండరాం, అమీర్ ఖాన్ ల‌ను ఎమ్మెల్సీగా నియ‌మించార‌ని దాసోజు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ ఇద్ద‌రితో ప్ర‌మాణ స్వీకారం చేయించవద్దని తెలంగాణ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story