స్మితా సభ‌ర్వాల్‌ రూ. 15 లక్షలు చెల్లించాల్సిందే

HC asks IAS officer Smita Sabharwal to refund Rs 15L.ఐఏఎస్ అధికారి స్మితాస‌భ‌ర్వాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 7:27 AM GMT
స్మితా సభ‌ర్వాల్‌ రూ. 15 లక్షలు చెల్లించాల్సిందే

ఐఏఎస్ అధికారి స్మితాస‌భ‌ర్వాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్ర‌భుత్వ న‌గ‌దును వినియోగించుకోవ‌డాన్ని న్యాయ‌స్థానం త‌ప్పుబ‌ట్టింది. ఓ ప‌త్రిక‌పై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.15లక్ష‌ల‌ను ఐఏఎస్ అధికారి స్మితాస‌భ‌ర్వాల్‌ చెల్లించాల‌ని ఆదేశించింది. ఏప్రిల్ 26 నుంచి 90 రోజుల్లోపు ఈ న‌గ‌దును ప్ర‌భుత్వానికి తిరిగి చెల్లించాల‌ని లేని ప‌క్షంలో త‌దుప‌రి 30 రోజుల్లో ఆ మొత్తాన్ని వ‌సూలు చేసి రిజిస్టార్ జ‌న‌ర‌ల్‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు ఏడేళ్ల క్రితం అంటే 2015లో ఓ హోట‌ల్‌లో నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షోలో ఐఏఎస్ అధికారి (అప్పటి సీఎం అదనపు కార్యదర్శి) తన భర్త అకున్ సబర్వాల్ (ఐపీఎస్ అధికారి)తో కలిసి ర్యాంప్‌పై కనిపించారు. దీనిపై ఓ ప‌త్రిక 'నో బోరింగ్ బాబు' అనే శీర్షిక‌తో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇందులో ఆమెతో పాటు సీఎంపైనా వ్యాఖ్య‌లున్నాయి. దీనిపై స్మితా స‌భ‌ర్వాల్ ఆ ప‌త్రిక‌కు నోటీసులు జారీ చేయ‌డంతో పాటు రూ.10కోట్ల ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

కోర్టు ఖ‌ర్చుల కోసం కొంత న‌గ‌దు కావాల‌ని స్మితాస‌భ‌ర్వాల్‌ ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌గా.. కేసు దాఖలు చేసేందుకు ఫీజు, ఖర్చుల నిమిత్తం రూ.15లక్షల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తూ ఓ జీవోను ఇచ్చింది. ఈ జీవోను స‌వాలు చేస్తూ వి.విద్యాసాగర్‌, కె.ఈశ్వర్‌రావు అనే వ్యక్తులు వేర్వేరుగా ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాలు, ఆ ప‌త్రిక మ‌రో పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది.

వీటిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలిల‌తో కూడిన ద‌ర్మాసనం విచార‌ణ చేపట్టింది. ఇటీవ‌ల తీర్పు వెలువ‌రించింది. ఓ ప్రైవేటు వ్య‌క్తికి మ‌రో ప్రైవేటు సంస్థ‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌డాన్ని ప్ర‌జాప్ర‌యోజ‌నంగా చెప్ప‌రాద‌ని, ప్ర‌భుత్వం కూడా ఎలాంటి చ‌ర్య తీసుకోవ‌డం లేద‌ని పేర్కొంది. ప్రైవేటు వ్య‌క్తి ప్ర‌యోజ‌నం కోసం ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఆర్థిక భారం వేయ‌డం స‌రికాదంది.

Next Story