తెలంగాణ సీఎంతో హార్వర్డ్ వర్సిటీ బృందం సమావేశం.. విద్యా కార్యక్రమాలపై చర్చ

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసింది.

By అంజి  Published on  12 Jan 2024 7:15 AM IST
Harvard varsity delegation, Telangana CM Revanth, education programmes

తెలంగాణ సీఎంతో హార్వర్డ్ వర్సిటీ బృందం సమావేశం.. విద్యా కార్యక్రమాలపై చర్చ

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (పీఎస్‌ఐఎల్‌-24) కార్యక్రమం గురించి సీఎంకు బృంద సభ్యులు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (పీఎస్‌ఐఎల్‌-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండీ రైట్ తదితరులు పాల్గొన్నారు.

Next Story