హన్మకొండ జిల్లాలో విషాదం, గోడ కూలి ముగ్గురు మృతి
హన్మకొండ జిల్లాలో భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 5:30 PM ISTహన్మకొండ జిల్లాలో విషాదం, గోడ కూలి ముగ్గురు మృతి
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. రోడ్లు జలమయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చేళ్లలోని వర్షపు నీరు చేరి పంట నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో పాతబడిన ఇళ్లలో ఎవరూ ఉండొద్దని అధికారులు చెబుతుంటారు. కానీ.. కొందరు ఆ సూచనలను పట్టించుకోరు. ఏం కాదు అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఆ నిర్లక్ష్యమే ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా హన్మకొండ జిల్లాలో భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
హన్మకొండ జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శాయంపేటలో గురువారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే. ఓ ఇంటి గోడ బాగా పాతబడి పోయింది. భారీ వర్షానికి తడిపోసిపోయిన గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు శాయంపేట మండల కేంద్రానికి చెందిన పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మగా అధికారులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. గోడ శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తర్వాత మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. వారిని నష్టపరిహారం ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.