Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 7 March 2024 10:30 AM GMTTelangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు నిర్వహించబడతాయి. ఈ మేరకు ఉత్తర్వులను విద్యాశాఖ వెల్లడించింది. అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడుల నిర్వహణ నేపథ్యంలో స్కూళ్లలో అందించే మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు అందజేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. ముందుగా భోజనం అందించాక తరగతులను నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.