హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో మార్కెట్లో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేఘన ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన ఫ్రాంచైజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యిని మార్కెట్లోకి వదులుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ప్రైవేట్ సంస్థ వనస్పతి నూనెలను (vegetable oils) ఉపయోగిస్తూ నెయ్యిని తయారు చేస్తోందని, దీనివల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విజయ బ్రాండ్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యి అమ్ముడవుతోందని, దీనివల్ల తెలంగాణలోని పాడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. కల్తీపాలు, నెయ్యితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని తెలిపారు.
ఏపీ తీరుతో తెలంగాణ పాడి రైతాంగానికి నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు విజయ డెయిరీ పేరును వాడుకోవడానికి వీల్లేదని, ఏపీకి ఈ విషయంపై లేఖలు రాసినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. ఇకనైనా దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.