Hyderabad: గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యి ఆర్మీ జవాన్‌ మృతి

ప్రమాదవశాత్తు జవాన్‌ చేతిలో ఉన్న గన్ మిస్‌ఫైర్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 9:00 PM IST
gun misfire,  Hyderabad, patancheru, jawan, died,

Hyderabad: గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యి ఆర్మీ జవాన్‌ మృతి 

జవాన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు జవాన్‌ చేతిలో ఉన్న గన్ మిస్‌ఫైర్ అయ్యింది. దాంతో.. అతను చనిపోయాడు. ఉన్నట్లుండి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

హైదరాబాద్‌ సమీపంలోని పటాన్‌చెరు మండలం జూనూతుల గ్రామానికి చెందిన పెట్నికోట వెంకటేష్ (34) ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. హైదరాబాదులోని సిఐఎస్ఎఫ్ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా వెంకటేష్ తమ బెటాలియన్ కు చెందిన బస్సులో అందరితో మాట్లాడుతూ... నవ్వుతూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతని వద్ద ఉండే తుపాకీ ప్రమాదవ శాత్తు పెలడంతో బుల్లెట్ ఒక్కసారిగా తలలోకి దూసుకెళ్లింది. జవాన్ బస్సులోనే రక్తపు మడుగులో కుప్పకూలి కింద పడిపోయి మరణించాడు. అందరూ చూస్తుండగానే జవాన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.బిడిఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తించుకొని తిరిగి బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది.

పోలీసులు ఈ ఘటన గన్ మిస్ ఫైర్ అయ్యి జరిగిందా లేక ఇంకేమైనా జరిగిందా అనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేష్ 13 సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరాడు. ఇతనికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వెంకటేష్ తండ్రి పెట్నికోట వడ్డే వెంకటస్వామి, తల్లి కూలి పనులు చేస్తూ జూనూతల గ్రామంలో నివసిస్తున్నారు. దేశానికి సేవ చేయడానికి వెళ్లిన కొడుకు.. మరణించాడన్న వార్త వినగానే ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్ మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

Next Story