న‌ల్ల‌గొండ జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం

Gun firing in Nalgonda District.న‌ల్ల‌గొండ జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. బైక్‌పై వెలుతున్న ఓ యువ‌కుడిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 6:38 AM IST
న‌ల్ల‌గొండ జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం

న‌ల్ల‌గొండ జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. బైక్‌పై వెలుతున్న ఓ యువ‌కుడిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు మూడు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న మునుగోడు మండ‌లం సింగారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం బ్రాహ్మ‌ణ‌వెల్లంల గ్రామానికి చెందిన‌ నిమ్మ‌ల లింగుస్వామి(32) మునుగోడులో కూల్‌డ్రింక్స్ షాప్ నిర్వ‌హిండంతో పాటు రియ‌ల్ ఎస్టేట్ చేస్తుంటాడు. రోజులాగే గురువారం కూడా షాపును మూసివేసిన త‌రువాత ద్విచ‌క్ర వాహ‌నంపై ఇంటికి వెలుతున్నాడు. సింగారం శివారు దాట‌గానే గుర్తు తెలియ‌ని దుండ‌గులు ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చి పిస్తోలుతో మూడు రౌండ్లు కాల్పులు జ‌రిపారు.

దీంతో లింగుస్వామి కింద‌ప‌డిపోయాడు. అత‌డు చ‌నిపోయాడ‌ని బావించిన దుండ‌గులు అక్కడి నుంచి ప‌రారు అయ్యారు. కాల్పుల శ‌బ్దాన్ని స్వామి అనే వ్య‌క్తి విని పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డిన లింగుస్వామిని నార్క‌ట్‌ప‌ల్లి కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా..ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Next Story