Telangana: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మార్గదర్శకాలు ఇవే!
అనధికార లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను అమలు చేస్తెన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 1 March 2025 5:34 PM IST
Telangana: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మార్గదర్శకాలు ఇవే!
అనధికార లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను అమలు చేస్తెన్న విషయం తెలిసిందే. మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జీవో 28 ప్రకారం.. మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ప్లాట్లు జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. లేదంటే తిరస్కరించడంతో పాటు ఫీజులో పది శాతం ప్రాసెసింగ్ కింద మినహాయించి, మిగతాది చెల్లిస్తారు. ఎఫ్‌టీఎల్ నుంచి 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా భూముల దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలిస్తారు.
ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు రెవెన్యూ శాఖకు పంపించాలి. ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీకి ముందుగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ ఆన్‌లైన్ లింకు ద్వారా దరఖాస్తుదారుడు పూర్తి సమాచారం అందించాలి. ఈ ప్లాట్లు అనధికార లేఅవుట్‌లో 26.08.2020 నాటికి ఉంటూ.. అంతకుముందు అందులో కనీసం పది శాతం ప్లాట్లు సేల్‌డీడ్ ద్వారా విక్రయం జరిగి ఉండాలి. కటాఫ్ తేదీ నాటికి ముందు విక్రయించిన ప్లాట్ల వివరాలు, దస్తావేజు పత్రాలను సమర్పించాలి.
ఎల్‌ఆర్‌ఎస్ - 2020లో దరఖాస్తు చేసి ఉంటే.. అవసరమైన సమాచారాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు బదిలీ చేయాలి. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్‌స్పేస్ ఛార్జీ 14 శాతం చెల్లించాలి. ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు, వసూలు చేసిన ఫీజుల వివరాలను సబ్‌రిజిస్ట్రారు ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపించాలి. సబ్ రిజిస్ట్రార్ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదిస్తే.. ప్లాటు కొనుగోలుదారుడి పేరిట ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి.