Ground Report: స్టేషన్ ఘన్‌పూర్‌లో గెలుపేవరిది?.. ప్రజలు ఏమంటున్నారు?
అవినీతి రహిత పాలన, అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే నాయకులకే పట్టం కడతామని స్టేషన్ ఘన్‌పూర్ యువత చెబుతోంది.
By అంజి Published on 8 Nov 2023 7:35 AM ISTGround Report: స్టేషన్ ఘన్‌పూర్‌లో గెలుపేవరిది?.. ప్రజలు ఏమంటున్నారు?
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ శాసన సభ నియోజకవర్గాని ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ నేతలే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. ఒకప్పుడు వీరిద్దరూ రాజకీయ విరోధులు. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నేతలు. అయినా ఇద్దరి మధ్య వైరం ముదిరిందే తప్ప.. ఇప్పటికీ తగ్గలేదు. ఒకే పార్టీలో ఉంటూ పైకి కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా.. పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని.. సీనియర్ నేత కడియం శ్రీహరికి టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్ అధిష్ఠానం. ఇక బీజేపీ నుంచి డాక్టర్ గుండె విజయ రామారావు, కాంగ్రెస్ నుండి సింగాపురం ఇందిరా పోటీలోకి దిగుతున్నారు.
నియోజకవర్గ నేపథ్యం
ఈ నియోజకవర్గం 1957లో ఘన్‌పూర్, ధర్మసాగర్, జఫర్‌గడ్ మండలాలతో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ తర్వాత 1978లో ఘన్‌పూర్ జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్‌డ్ నియాజకవర్గంగా ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ.. రాష్ట్రం వచ్చాక బీఆర్‌ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు కాంగ్రెస్, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్ 4 సార్లు విజయ సాధించాయి. సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 సారి చొప్పున గెలిచాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. వరుసగా నాలుగు సార్లు గెలవగా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ తరఫున మూడుసార్లు గెలిచారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏడు మండలాలున్నాయి. అవి.. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు, జఫర్‌గఢ్. ఈ సెగ్మెంట్ లో 2,42,981 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,20,848 మంది ఉన్నారు. మహిళలు 1,22,132 మంది ఉన్నారు. ఇతరులు ఒకరు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా దళిత ఓటర్లు ఉన్నారు.
కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న ఈ నియోజకవర్గం విషయంలో మాత్రం మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కేటాయించింది. కడియం శ్రీహరి.. 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ సీఎంగాను, విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి అనే ఓ చిన్న గ్రామంలో జన్మించారు. వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. 2014-15 మధ్యకాలంలో వరంగల్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. అంతకు ముందు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మేల్యేగా ఉన్నారు. నందమూరి తారకరామారావు, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ కడియం కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు.
డాక్టర్ గుండె విజయ రామారావు
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి జి. విజయ రామారావు పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అయిన రామారావు.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ కోసం మాదాసు వెంకటేశ్, బొజ్జపల్లి ప్రదీప్ పోటీపడినా.. విజయరామారావుకే బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. విజయ రామారావు.. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004లో జరిగిన ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ , టిఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి పై ఓట్ల 1,9720 మెజారిటీతో గెలిచి వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. 2013లో టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
సింగాపురం ఇందిరా
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగాపురం ఇందిరా పోటీ చేస్తున్నారు. ఆమె టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ చేశారు. ఇందిరా వృత్తి.. వ్యాపారం. గత ఎన్నికల్లో సింగపురం ఇందిర పోటీ చేసినా.. కాంగ్రెస్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆఖరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యే. ఈ నియోజకవర్గ టికెట్ కోసం ఇక్కడి నుంచి చాలా మంది ఆశావహులు పోటీపడినా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం.. మరోసారి సింగపురం ఇందిరకే అవకాశం ఇచ్చింది.
ప్రస్తుత ఎమ్మెల్యే
ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో 1981లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి కూడా. అయితే అనతి కాలంలోని పదవి పొగొట్టుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా సింగపురంపై రాజయ్య 35,790 ఓట్ల మెజారితో గెలిచాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతోపాటు బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు చేయడంతో అధిష్టానం ఈ సారి ఆయనకు టికెట్ నిరాకరించింది. 2023 అక్టోబర్ 05న తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యర్థుల హోరాహోరి ప్రచారం..
ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ ప్రాబల్యం పెద్దగా కనిపించడం లేదు. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య విభేదాలు ఉండటంతో అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు సులువైనట్టేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ ఓటర్లు ఈసారి తప్పకుండా తమకే పట్టం కడతారన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగాపురం ఇందిరా.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సింగపురం ఇందిర ఓటర్లకు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే స్టేషన్‌ఘన్‌పూర్‌ను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు గడిచినా బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం లేదన్నారు. మరోవైపు కేసీఆర్ ఆశీర్వాదంతో స్టేషన్ ఘన్పూర్ రూపురేఖలు మారుస్తానని కడియం శ్రీహరి చెబుతున్నారు. తనను మీ ఎమ్మెల్యేగా గెలిపించి, నిండు మనస్సుతో ఆశీర్వాదించాలని కోరారు. గ్రామాల్లో ప్రగతిలో ఉన్న పనులు సమస్యలను పరిష్కరించి, ఇంకా అభివృద్ధి పనులను చేయిస్తానన్నారు. ఇక తాటికొండ రాజయ్య ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్‌కు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో మంగళవారం నాడు బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నమిలిగొండ గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయన్నారు.
ఇటు కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరా మంగళవారం నాడు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నామని సింగాపురం ఇందిరా తెలిపారు. అటు బీజేపీ అభ్యర్థి గుండె విజయ రామారావు కూడా ప్రచారం చేస్తున్నారు. నీతి, నిజాయితి పరున్ని అని చెప్పుకుంటున్న కడియంకు బంగ్లాలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. పేదల కోసం పని చేసే పార్టీ కావాలంటే బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గ ఓటర్లు ఏమంటున్నారంటే..
అవినీతి రహిత పాలన, అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే నాయకులకే పట్టం కడతామని స్టేషన్ ఘన్‌పూర్ యువత చెబుతోంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై స్పందించే వారికే ఓటు వేస్తామంటున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు తీరు, చేపట్టాల్సిన అభివృద్ధి ఇంకా ఎంతో ఉందని యువత చెబుతోంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ధర్మసాగర్ మండల వాసి మాట్లాడుతూ.. నిరుపేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధుల అనుచరులకు, సన్నిహితులకు మాత్రమే అందుతున్నాయని అన్నారు. పేదలకు అన్యాయం జరుగుతోందని, పథకాలు అర్హులకు మాత్రమే అందాలన్నారు. అయిదేళ్ల పాటు అన్ని వర్గాలకు పారదర్శకంగా సేవలందించే నేతకే తాను ఓటు వేయబోతున్నానని తెలిపారు.
దేవూనూర్ గ్రామ నివాసి సంగేకరి హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ సారి వందకు 200 శాతం గెలిచేది బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరేనని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కడియం కృషి చేశాడని చెప్పాడు. జే.చొ క్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ ప్రాజెక్టుకు నీటిని తీసుకొచ్చాడని, ఇప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీరు అందుతుందంటే అది ఆయన చొరవ వల్లేనన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కడియంకు మంచి పట్టు ఉందన్నారు. ఇలా చాలా మంది కూడా తమ మద్దతు కడియం శ్రీహరికే అని చెబుతున్నారు.
నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరా పేరు గత ఎన్నికల్లో తేరపైకి వచ్చిందని, ఆమె ఇక్కడ ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు. 2018 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య దగ్గరి బంధువు కావడం వల్లే కాంగ్రెస్ సింగాపురం ఇందిరాను బరిలోకి దించిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పెద్దగా పోటీ లేకపోవడంతో మళ్లీ టికెట్‌ని అధిష్ఠానం ఆమెకే కేటాయించిందని హరికృష్ణ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సరిగ్గా సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. మిషన్ భగీరథ అట్టర్ల్ ప్లాఫ్ అని, పేరుకే పైప్ లైన్‌లు వేశారని హరికృష్ణ అన్నారు.
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండె విజయ రామారావు.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమీ లేదని, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప, అభివృద్ధి చేసింది ఏమీ లేదని నియోజకవర్గ వాసులు అంటున్నారు.
తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ వాసులు అంటున్నారు. తమ నియోజకవర్గం కేంద్రం నుండి హైదరాబాద్‌కు నేషనల్ హైవే వెళ్తుండటం వల్ల ఆ పరిసరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది, కానీ.. ఆ రహదారులు తప్పించి గ్రామాల్లో, మిగతా మండలాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు హామీలు ఇవ్వడం.. తప్ప నేరవేర్చింది లేదంటున్నారు.
రాజయ్య నిద్రమత్తు వల్ల దేవునూర్ గ్రామానికి రావాల్సిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు కూడా రాకుండా పోయిందన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత బతుకు దెరువు కోసం హైదరాబాద్ బాట పట్టారని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ వాసులు చెబుతున్నారు.
''సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదు. ఇళ్లు లేని వాళ్లకు ఇళ్లులు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే వచ్చి సమస్యలు వినడమే తప్ప.. వాటిని పరిష్కారం చేసింది లేదు'' అని ఘన్‌పూర్‌లో ఓ చిన్న హోటల్ నడుపుతున్న రాధమ్మ చెప్పింది.
దేవునూర్ ఫారెస్ట్‌ను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలి
హన్మకొండ జిల్లాలోని ఏకైక అటవీప్రాంతం దేవునూర్ అటవీ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని ఫారెస్ట్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేవునూరు అటవీప్రాంతం భూకబ్జాదారుల అక్రమ ఆక్రమణల ముప్పును ఎదుర్కొంటోందని స్థానికులు చెబుతున్నారు. 1,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ఫారెస్ట్ బ్లాక్ హన్మకొండ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అనేక అరుదైన జాతుల పక్షులు, మొక్కలు, జంతువులకు ఆవాసం. ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉండటంతో, ట్రెక్కర్లు, పక్షి వీక్షకులు, ఇతర పర్యాటకులు ప్రకృతి ఒడిలో కొంత విరామ సమయాన్ని గడపడానికి ఇది అనువైన ప్రదేశం. అయితే భూకబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, సక్రమంగానూ, అక్రమంగానూ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోందని, ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం వల్ల భూ ఆక్రమణ, మైనింగ్‌కు అడ్డుకట్ట వేయొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు.
మొత్తానికి నియోజకవర్గ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదంటున్న పబ్లిక్.. పని చేసే వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరికే తమ ఓటు అని నియోజకవర్గ వాసులు బహిరంగంగా చెబుతున్నారు. గతంలో ఆయన చేసిన మంచి పనుల వల్లే ఈ సారి ఆయనను గెలిపించుకోబోతున్నామని చెబుతున్నారు. పేదలకు పథకాలు అందడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, బీఆర్‌ఎస్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, 24 గంటల కరెంట్ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు.. ఎరువుల ధరలు తగ్గించాలని, పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలకే పథకాలు అందుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి కూడా కాస్తా పాజిటివ్ కనిపించింది. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌కే పట్టం కడతారా? లేకా మరొక పార్టీకి అవకాశం ఇస్తారా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.