అనారోగ్యంతో ఉన్న వధువును ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు
ఆస్పత్రిలో వరుడు అనారోగ్యంతో ఉన్న వధువును వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి మంచిర్యాల ఆస్పత్రిలో జరిగింది.
By అంజి Published on 24 Feb 2023 9:58 AM ISTఆస్పత్రే పెళ్లి వేదికైంది. వైద్యులే పెళ్లి పెద్దలుగా మారారు. ఆస్పత్రిలో వరుడు అనారోగ్యంతో ఉన్న వధువును వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి మంచిర్యాల ఆస్పత్రిలో జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతి, చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన శైలజ వివాహం గురువారం ఉదయం జరగాల్సి ఉంది. అనూహ్యంగా శైలజ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. ఆమెకు మైనర్ సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స అనంతర వైద్యుల పరిశీలనలో ఉంది.
అనుకోని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడుతుందని బంధువులంతా భావించారు. అయితే అది వరుడిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వధువు, ఆమె కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచే విధంగా వరుడు తిరుపతి దండలు, మంగళసూత్రంతో వధువు ఆసుపత్రి గదిలోకి వెళ్లాడు. శైలజ తన ఆసుపత్రి బెడ్‌పై కూర్చున్నప్పుడు, వరుడు పక్కనే నిల్చొని దండలు మార్చుకున్నారు. అనంతరం వరుడు వధువుకు తాళికట్టాడు. వైద్య సిబ్బంది, రోగులు చూస్తుండగానే కొందరు సన్నిహితులు ఉన్న సమయంలో ఆసుపత్రి గదిలో వారు పెళ్లి చేసుకున్నారు.
కొత్తగా పెళ్లయిన జంట ఫోటోలకు పోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పెళ్లి వేడుక వైరల్‌గా మారింది. వరుడు పెళ్లి వేడుకను వాయిదా వేయడానికి ఇష్టపడలేదు. పూజారులు గతంలో సూచించిన సమయంలో పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కొత్త జంట జిలకర బెల్లం, తలంబ్రాలు వంటి కొన్ని ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అనుకోని పరిణామాలతో ఆస్పత్రిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, పూర్తిగా ఆగిపోవడం కంటే ఎక్కడో ఒక చోట జరగడం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ పెళ్లి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.