కరీంనగర్, హైదరాబాద్‌లోని గ్రానైట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో 'పనామా లీక్స్'లో పేరు వచ్చిన చైనాకు చెందిన ఓ సంస్థతో సంబంధమున్నట్లు వెల్లడైంది. ఫెడరల్ ఏజెన్సీ ఈ గ్రానైట్ కంపెనీల నుండి రూ. 1.08 కోట్ల హవాలా డబ్బును స్వాధీనం చేసుకుంది. క్వారీల నుండి 10 సంవత్సరాల భారీ గ్రానైట్ డిస్పాచ్ డేటాను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సొంతం చేసుకుంది. కరీంనగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కమలాకర్ నివాసం, ఇళ్ల స్థలాలపై ఇటీవలే ఈడీ దాడులు నిర్వహించింది. కమలాకర్ తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటాయించిన మైన్లలో అనుమతికి మించి మైనింగ్ చేపట్టారన్న ఫిర్యాదులు రావడంతో.. అక్రమాలపై ఐటీ, ఈడీ దృష్టి సారించింది.
ఇప్పటికే శ్వేతా ఏజన్సీ, ఏఎస్‌యూవై షిప్పింగ్, జేఎమ్ బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్‌ఆర్ ఏజన్సీస్, కేవీఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌కు నోటీసులు ఇచ్చారు. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో పాటు ఆదాయపన్ను ఎగవేతలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. శ్వేత గ్రానైట్ ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద వ్యాస్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో సంబంధం కలిగి ఉన్నాయి.
ఈ కంపెనీలు చైనా, హాంకాంగ్ S.A.R.. ఇతర దేశాలకు గ్రానైట్ బ్లాక్‌లను ఎగుమతి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. విచారణ సమయంలో, భారత ప్రభుత్వానికి 'రాయల్టీ' చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేయబడిన పరిమాణం ఎక్కువగా ఉందని కనుగొనబడింది. ఇది ఫెమా ఉల్లంఘన చట్టం కిందకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్రానైట్ ఎగుమతిదారుల ఉద్యోగుల పేరిట ఉన్న పలు బినామీ బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ బృందాలు గుర్తించాయి. రుణాల రూపంలో చైనీస్ సంస్థల నుండి భారతీయ సంస్థలకు లావాదేవీలను గుర్తించారు.
ఈ చైనీస్ సంస్థలు పనామా లీక్స్‌లో కనిపించిన లి వెన్హువోకు చెందినవని ED ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికల విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధారంగా అక్రమ గ్రానైట్ మైనింగ్, ఫెమా ఉల్లంఘనలపై ED దర్యాప్తు ప్రారంభించిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ 3 దశాబ్దాలుగా కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్ సంస్థల్లో ఉన్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కారణంగా ఖజానాకు సుమారు ₹ 750 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ 2012లో ఎమ్మెల్యే కమలాకర్ పై కేసు నమోదైంది.