తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లోనే ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఈ మూడేళ్లలో మహిళ గవర్నర్‌ను వివక్షకు గురి చేశారని అన్నారు. కొన్ని విషయాలు తాను బయటకు చెప్పలేనని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతానని అన్నారు.
తాను ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైందన్నారు. గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజ్‌భవన్‌లోని కార్యక్రమాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి ఫొటోలు ఉంచాలని, అందుకే రాజ్‌భవన్‌కు రావట్లేదంటే.. రేపే రాజ్‌భవన్‌లో ఫొటో పెట్టిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కృషి చేయాలని భావిస్తున్నానన్నారు. గౌరవం ఇవ్వనంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదనీ, పేదలు, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తమిళిసై అన్నారు.
కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నామన్నారు. ఆదివాసీల కోసం ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. విద్యార్థుల అవస్థలు, సమస్యలను గుర్తించి సీఎం కేసీఆర్ లేఖలు రాశానన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్‌క్రాస్ ద్వారా సేవ చేశామని, పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందజేశామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్‌భవన్‌ను అవమానించారని, ఆయా అంశాలు తెలంగాణ చరిత్ర పేజీల్లో నిలిచిపోతాయని గవర్నర్ వ్యాఖ్యానించారు.