రక్తదానం చేయడం చిన్న విషయం కాదు : గవర్నర్ తమిళిసై
Governor Tamilisai and Megastar Chiranjeevi Honoured Blood donors.రక్తదానంచేయడం చిన్నవిషయం కాదని గవర్నర్ అన్నారు
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2022 7:53 AM GMTరక్తదానం చేయడం చిన్న విషయం కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి ఆదివారం రాజ్‌భవన్‌లో 'చిరు భద్రత' పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం చిన్న విషయం కాదన్నారు. తాను హౌస్ సర్జన్‌గా పని చేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేదని.. అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవ చేస్తున్న చిరంజీవిని అభినందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు.
చిరంజీవి మాట్లాడుతూ.. 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించాయని చెప్పుకొచ్చారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని, వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించానని తెలిపారు. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు వెలుతున్నారని అన్నారు.
యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్ ఇన్సూరెన్స్ కార్డులు అందిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇందులో 70 శాతం పేదలకు ఉచితంగా అందించామన్నారు. మిగిలింది ప్రైవేటు ఆస్పత్రులకు అందజేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య చాలా తక్కువగా ఉందన్నారు.