టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది.
By అంజి Published on 5 Oct 2023 12:43 AM GMTటీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి.. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం.. తాజాగా డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
"టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది." అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు.