రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన డీసీఎం.. రాంగ్​రూట్ చూపించిన గూగుల్‌ మ్యాప్‌

గూగుల్‌ మ్యాప్‌ తప్పుడు డైరెక్షన్లు చూపించి.. డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ఓ డ్రైవర్‌ను గూగుల్‌ మ్యాప్‌ నట్టేట ముంచింది.

By అంజి  Published on  11 Dec 2023 4:00 AM GMT
Google map, wrong direction, van, Gauravelli project, Siddipet

రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన డీసీఎం.. రాంగ్​రూట్ చూపించిన గూగుల్‌ మ్యాప్‌ 

ఇప్పుడందరూ ఎక్కడికి వెళ్లాలన్న గూగుల్‌ మ్యాప్‌లపైనే ఆధారపడుతున్నారు. అడ్రస్‌ అడుగుదామంటే.. వింతగా చూస్తారేమోనని చాలా మంది గూగుల్‌ మ్యాప్స్‌నే నమ్ముకుంటున్నారు. అయితే కొన్ని సార్లు గూగుల్‌ మ్యాప్‌ కూడా తప్పుడు డైరెక్షన్లు చూపించి.. డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ఓ డ్రైవర్‌ను గూగుల్‌ మ్యాప్‌ నట్టేట ముంచింది. రాత్రి సమయంలో గూగుల్‌ మ్యాప్స్‌ రూట్‌‌లో డీసీఎం తోలడంతో చివరకు అది రిజర్వాయర్‌లో దిగింది. ప్రమాదాన్ని డ్రైవర్ చివరి నిమిషంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. డీసీఎంలోని డ్రైవర్‌, సిబ్బందిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర జరిగింది. హన్మకొండ నుంచి మిల్క్ ప్యాకెట్ల లోడుతో ఓ డీసీఎం హుస్నాబాద్‌కు వెళ్లింది.

అక్కడ నుండి రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్లో డ్రైవర్ వాహనం నడిపాడు. అయితే, నందారం స్టేజీ దగ్గర కుడివైపు చూపించాల్సిన మ్యాప్స్ ఎడమవైపు చూపించడంతో డీసీఎం నేరుగా గౌరవెల్లి రిజర్వాయర్ నీటిలో దిగింది. గూగుల్ మ్యాప్‌నే నమ్మిన డ్రైవర్ రోడ్డుపై వాన నీరు ఉందని భావించి రిజర్వాయర్‌లోకి వాహనాన్ని తోలాడు. అయితే వెళ్తున్న కొద్ది లారీ నీళ్లల్లోకి దిగబడిపోతుండటంతో తప్పుడు డైరెక్షన్‌లో ప్రయాణిస్తున్నామని డ్రైవర్ గ్రహించి వాహనాన్ని వెంటనే ఆపివేశాడు.లారీ డ్రైవర్, ఇతర సిబ్బంది ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉదయం డీసీఎంను బయటకు తీశారు.

Next Story