ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, నష్టాల నుంచి గట్టు ఎక్కేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శత విధాల ప్రయత్నిస్తోంది. సంస్థ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మైరుగైన సేవలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. తాజాగా ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించింది. రాజధాని టిక్కెట్టుకు సమానంగా ఈ చార్జీలను సవరించారు. దీంతో రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.
కాగా.. ఈ సవరించిన, తగ్గించిన చార్జీలు ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. అంతరాష్ట్ర సర్వీసుల్లో తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు ముందున్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నారు. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని తెలిపారు. దీనిపై సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ.54 తగ్గినట్లు తెలిపారు.