తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయని గుర్తుచేశారు. అందులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని.. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని.. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో రూ.3000 కోట్లు కోటాయించామన్నారు. ముందు ముందు ఆర్టీసీని ఇంకా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతామని చెప్పారు. రవాణా శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.