ప్రయాణికులకు శుభవార్త.. 8 స్పెషల్ రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు ప్రయాణాలు కట్టారు.
By అంజి Published on 16 Aug 2024 2:15 PM ISTప్రయాణికులకు శుభవార్త.. 8 స్పెషల్ రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు ప్రయాణాలు కట్టారు. కొందరు బంధువుల ఇళ్లకు మరికొందరు విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ప్రజల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వేను అభ్యర్థించారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. మరో 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.
18వ తేదీన నర్సాపూర్ - సికింద్రాబాద్, 19వ తేదీన సికింద్రాబాద్ - నర్సాపూర్, 15, 17, 19వ తేదీల్లో కాకినాడ - సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రబాద్ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే రోజూ 210 రైళ్లను నడుపుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తోందని, గత నాలుగు నెలల్లో రూ.6,984 కోట్ల ఆదాయాన్ని సాధించిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలీస్తే ఆదాయం 3 శాతం మెరుగైందన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు జోన్ పరిధిలో సరుకు రవాణా విభాగంలో రూ.4,611 కోట్ల ఆదాయాన్ని అర్జించామని చెప్పారు.