తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు రెండున్నర కిలోల బంగారు చీరను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు మంత్రి తలసాని. ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు తెలంగాణ రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు.
దాతలు ఈ చీరను తయారు చేయించారని తెలిపిన మంత్రి.. తెలంగాణ వాసులకు ఎల్లమ్మ తల్లి ఇలవేల్పుగా నిలిచిందని, అమ్మను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న కేసీఆర్, భవిష్యత్తులో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ సమక్షంలో అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు.
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అమీర్‌పేటలోని గురుద్వారను సందర్శించిన మంత్రి తలసాని.. కేసీఆర్ శ్రేయస్సు కోరుతూ పూజలు నిర్వహించారు.