ఉగ్ర‌గోదారి.. భయం గుప్పిట్లో భద్రాద్రి

Godavari Water level crossed 67 feet in Bhadrachalam.తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 3:54 AM GMT
ఉగ్ర‌గోదారి.. భయం గుప్పిట్లో భద్రాద్రి

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రి మ‌హోగ్ర‌రూపం కొన‌సాగుతోంది. గంట గంట‌కు వ‌రద ప్ర‌వాహం పెరుగుతూ ఉదృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో భ‌ద్రాచ‌లం ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో వ‌ణికిపోతున్నారు. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటిమ‌ట్టం రికార్డు స్థాయిలో 67.10 అడుగుల‌కు చేరుకుంది. 22 ల‌క్ష‌ల క్యూసెక్యుల వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నాం స‌మ‌యానికి 70 అడుగుల‌కు దాటే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణానికి వెళ్లే ప్రసిద్ధ వంతెనను జిల్లా అధికారులు మూసివేశారు. భద్రాచలం ప్రాంతంలో నీటి మట్టాలు పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. మరో 48గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరదల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి జిల్లా యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు.

ఇదిలా ఉంటే.. 1976 నుంచి గోదావ‌రి నీటి మ‌ట్టం 60 అడుగుల మార్క్ దాటడం ఇది 8వ సారి. చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు మాత్ర‌మే 70 అడుగులు దాటింది. 50ఏళ్ల క్రితం గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరింది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అవుతుందా అన్న ఆందోళన ప్రజలు, అధికారుల్లో నెలకొంది.

భారత వాతావరణ శాఖ స్కాన్ చేసిన ఉపగ్రహ చిత్రాలు ప్రత్యేక వరద హెచ్చరికలో విడుదల చేసిన హైడ్రోగ్రాఫ్ ప్రకారం గోదావరి నదికి గరిష్ట వరదలు పేరూర్ గ్రామంలో ఉన్నట్లు చూపుతున్నాయి. చిత్రాలు గోదావరి నది ఉప్పొంగుతున్నట్లు చూపుతున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు ఇన్‌ఫ్లోలు కొనసాగే అవకాశం ఉంది.

Next Story
Share it