భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 4:30 AM GMTభద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 53.40 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14.45 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు మూడో హెచ్చరికను జారీ చేశారు. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భద్రాచలం దిగువ ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. జలదిగ్భంధంతో ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయత్రం 4.16 గంటల వరకు గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 53 అడుగులు ఉంది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 34 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం-వాజేడు, భద్రాచలం-కూనవరం, భద్రాచలం-చర్ల మార్గంలో పలు ప్రాంతాల్లో రహదారులపై గోదావరి వరద ప్రవహిస్తోంది. వరద ప్రభావం ఉన్న వారిని ఇప్పటికే చాలా మందిని పునరావాసాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 94 కుటుంబాలకు చెందిన 306 మందిని పునరావాస కేంద్రాలకు చేర్చినట్లు వివరించారు.
మరోవైపు కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దాంతో.. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రోజుల్లో నిండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం జలాశయానికి 4.12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. జలవిద్యుత్ ఉత్పాదన కోసం 74,258 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 127.6 టీఎంసీల నీరు ఉంది.