భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం
Godavari Flood Water Reaches 51 Feet in Bhadrachalam.గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న
By తోట వంశీ కుమార్ Published on 13 Sep 2022 8:59 AM GMTగోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 50.2 అడుగులు ఉండగా.. మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో 51 అడుగులకు చేరింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
గోదావరి స్నాన ఘట్టాలు చాలా వరకు మునిగిపోయాయి. గోదావరి కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉన్నందున స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు నీటిప్రవాహం పెరుగుతూనే వస్తోంది.
మరోవైపు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 11.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజి గేట్లు ఎత్తేసి 9.9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ప్రభావిత మండలాలను ఏపీ విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు సూచించింది.