రేపు కేసీఆర్‌ బహిరంగ సభ.. అదే రోజు హైదరాబాద్‌కు మోదీ.. పెరిగిన రాజకీయ వేడి

GHMC Elections- Hyderabad modi visit.. KCR Public meeing .. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచా

By సుభాష్  Published on  27 Nov 2020 3:13 PM IST
రేపు కేసీఆర్‌ బహిరంగ సభ.. అదే రోజు హైదరాబాద్‌కు మోదీ.. పెరిగిన రాజకీయ వేడి

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. ప్రచారానికి ఇంకో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. ప్రచారంలో అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యోరోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇలా ఎన్నో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అయితే ఈనెల 28న నగరంలో వాడి వేడి కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28న శనివారం సాయంత్రం బహిరంగ సభ ఉంటుదని ఇటీవల మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, 28నే ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. దీంతో గ్రేటర్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది.

28న మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నారని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కోవిడ్‌-19 కట్టడికి నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న 'కొవాగ్జిన్‌' ఉత్పత్తిని స్వయంగా మోదీ పరిశీలించనున్నారు. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట వద్ద గల భారత్‌ బయోటెక్‌ ల్యాబ్‌ను సదర్శిస్తారు. వ్యాక్సిన్‌ రూపకల్పనకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మోదీ మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం పుణె పర్యటనకు బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.

అనంతరం పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంకు అగ్రనేతలు

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు రానున్నారు. వీరంతా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షోలో పాల్గొననున్నారు.

ఎత్తుకు పై ఎత్తు..

కాగా, ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎత్తుకుపై ఎత్తులువేస్తోంది. ఈనెల 28న 30 వేలమందితో నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించి గ్రేటర్‌ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. సరిగ్గా అదేరోజు ప్రధాని మోదీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో దూకుడు వ్యవహారశైలితో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. చివరి అస్త్రంగా ప్రధాని మోదీని నగరానికి రప్పిస్తున్నట్టు సమాచారం. సీఎం బహిరంగసభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంత వరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికలే బీజేపీ లక్ష్యం

కాగా, దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో గెలుపుతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి 2023లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బల్దియా ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగి పర్యటనకు వస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ ఈ నెల 28న అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తరువాతే కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయి.

Next Story