స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి: మంత్రి పొన్నం
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను బీఆర్‌ఎస్ ఖాళీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు.
By అంజి Published on 2 Jan 2025 12:19 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి: మంత్రి పొన్నం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను బీఆర్‌ఎస్ ఖాళీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సంక్రాంతికి రైతు భరోసా, త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. సిద్ధిపేట జిల్లా కోహెడలో నిర్వహించి కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
అంతకుముందు హుస్నాబాద్ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేస్తూ.. ''స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. గౌరవెళ్లి కాలువలు పూర్తి చేసి పొలాలకు సాగు నీరు అందిస్తాం. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి ఇప్పటికే మంజూరు అయినా పనులకు త్వరలోనే శంఖుస్థాపన చేస్తాం. గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇల్లు.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో ఎవరి జోక్యం ఉండదు'' అని అన్నారు.