రూ.500కే సిలిండర్‌పై ఇంకా ఆదేశాలు రాలేదు: ఎల్‌పీజీ డీలర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటవెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By - Srikanth Gundamalla |
రూ.500కే సిలిండర్‌పై ఇంకా ఆదేశాలు రాలేదు: ఎల్‌పీజీ డీలర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటవెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో పాటు.. ప్రగతి భవన్ పేరు మార్చడం సహా ఇతర అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల్లో ఒకటైన రూ.500లకే గ్యాస్ సిలిండర్ గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20 రోజులవుతున్నా దీనిపై మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. దాంతో.. ఈ విషయంపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సబ్సిడీ గ్యాస్ కోసం తెలంగాణ గ్యాస్ ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కేవైసీ అప్‌డేట్ ఉంటేనే రూ.500 గ్యాస్ వస్తుందని అంటుండటంతో.. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం భారీగా బారులు తీరుతున్నారు. ఇంకొందరైతే ఆన్‌లైన్ ద్వారా తమకు తామే అప్‌డేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి విధివిధానాలు రూపొంచలేదని.. తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని హైదరాబాద్ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు. కేవైసీ అప్‌డేట్ చేసినవారికి మాత్రమే సబ్సిడీ గ్యాస్ వస్తుందనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇలాంటి ఆదేశాలు అయితే తమకు ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. కేవలం ఇది ఒక రూమర్ మాత్రమే అని కొట్టిపాడేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ నుంచే కేవైసీ అప్‌డేట్ జరుగుతోందని అశోక్ కుమార్ వెల్లడించారు. కేవైసీ అప్‌డేట్‌కు.. సిబ్సిడీ గ్యాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే విధివిధానాల ప్రకారం లబ్ధిదారులకు సిబ్సీడిపై గ్యాస్ అందుతుందని అశోక్ కుమార్ వివరించారు.