సంతానం లేని దంపతులకు గుడ్‌న్యూస్.. గాంధీలో IVF సెంటర్

సంతానం లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  8 Oct 2023 5:51 AM GMT
Gandhi hospital, IVF center, Good news,  telangana,

 సంతానం లేని దంపతులకు గుడ్‌న్యూస్.. గాంధీలో IVF సెంటర్

సంతానం లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజల కోసం తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రూ.5 కోట్లతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్తులో ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఈ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హోంమంత్రి మహమూద్‌అలీ ఈ ఐవీఎఫ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్ కూడా చేశారు. ఈ సెంటర్‌కు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా షేర్‌ చేశారు.

గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్రభుత్వ ఐవీఎఫ్‌ సెంటర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుందని అన్నారు. అత్యంత ఖరీదైన ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ను ఇప్పుడు ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని.. తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించిన ఈ అపూర్వ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అమలు చేస్తోంది.. దేశం ఆచరిస్తోందని వ్యాఖ్యానించారు హరీశ్‌రావు.

అయితే.. 2018 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రం ద్వారా అందిన మందులతో ఇప్పటి వరకు 200 మంది మహిళలకు సంతానం కలిగిందని చెప్పుకొచ్చారు. కాగా.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో ఐవీఎఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చిందని.. ఇది తెలంగాణ ప్రజలకు శుభపరిణామం అని చెప్పారు.

Next Story