గద్వాల MLAగా డీకే అరుణను గుర్తించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 1:30 PM GMTగద్వాల MLAగా డీకే అరుణను గుర్తించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో ఇటీవల తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు పత్రాలు సమర్పించారని నిర్ధారణ కావడంతో హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే.. కృష్ణమోహన్‌రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తనని ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఇటీవల డీకే అరుణ అసెంబ్లీ స్పీకర్ సహా కార్యదర్శిని కలిసేందుకు వెళ్లింది. కానీ అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అసెంబ్లీకి వెళ్లిన సమయంలో అక్కడెవరూ లేరు. దాంతో.. తెలంగాణ హైకోర్టు తీర్పు మరోసాయి అమలు కాకుండా పోయింది.
ఈ క్రమంలోనే గద్వాల ఎమ్మెల్యే ఎన్నికల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశం చేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాను రాసిన లేఖలో పేర్కొంది. హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన చేతిలో డీకే అరుణ ఓటమి పాలయ్యారు. ఎన్నికల సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు పత్రాలు సమర్పించారని.. హైకోర్టును ఆశ్రయించారు డీకే అరుణ. అయితే.. ఆమె పిటిషన్‌పై చాలా కాలం తర్వాత విచారణ జరిపి ఎన్నిక రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణకు రూ.50వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇక 2018 డిసెంబర్ నుంచే ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అయితే.. తాజాగా గెజిట్ విడుదల చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి లేఖ పంపింది.