బస్సుల్లో ఫ్రీ జర్నీలో పొరపాట్లు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు: ఆర్టీసీ ఎండీ

రెండ్రోజులుగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది.

By Srikanth Gundamalla  Published on  11 Dec 2023 4:37 PM IST
free bus journey, telangana, rtc md sajjanar ,

 బస్సుల్లో ఫ్రీ జర్నీలో పొరపాట్లు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు: ఆర్టీసీ ఎండీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణంపై హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలు అంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. తద్వారా రెండ్రోజులుగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ మహాలక్ష్మి పథకం అమలు తీరుని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద సోమవారం తనిఖీ చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పలు ప్రాంతాలకు వెళ్తున్న మహిళలతో మాట్లాడారు. వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ జేబీఎస్ నుంచి మెట్టుగూడ వరకు సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను కూడా అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్‌ జెండర్లు ఈ సదుపాయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆర్టీసీ సంస్థను ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు సజ్జనర్‌ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే 40వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. మహిళలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించే మహిళలు స్థానికతను తెలిపే ఆధార్‌కార్డును చూపించాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది కూడా సమన్వయం, ఓపికతో ముందుకు సాగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్న సందర్భంగా.. బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు అవగాహన లేనివారు మహిళకు టికెట్‌ ఇవ్వడం కూడా చూశాం. ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఫిర్యాదు చేయొచ్చిన వీసీ సజ్జనార్‌ తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే 040-69440000, 040-23450033 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని సజ్జనార్ సూచించారు.

Next Story