సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్‌.. కీల‌క విష‌యాలు వెలుగులోకి

Fourteen Days custody to Avula Subbarao in Secunderabad Riots Case.కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 8:16 AM GMT
సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్‌.. కీల‌క విష‌యాలు వెలుగులోకి

కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ సికింద్రాబాద్‌లో అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడ‌మీని నిర్వ‌హిస్తోస్తున్న ఆవుల సుబ్బారావు ఈ అల్ల‌ర్ల‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారిగా పోలీసులు తేల్చారు. సుబ్బారావుతో పాటు అత‌డి ముగ్గురు అనుచ‌రులను మ‌ల్లారెడ్డి, శివ కుమార్‌, బీసీ రెడ్డిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సెక్ష‌న్లు 143, 147, 324, 307, 435, 427, 448, 336, 332, 341, 120 (B), 201 r/w 149 IPC & 147, 145 (C), 150, 151, 152, 153, 154, 155, 156, 174 (A), 162, 164, 166, Railway Act & Sec 3 and 4 of PDPP Act & 174 CrPC కింద కేసు న‌మోదు చేశారు. వారిని నేడు(శ‌నివారం) రైల్వే కోర్టులో హాజ‌రు ప‌రిచారు. వాద‌న‌లు విన్న రైల్వే న్యాయ‌స్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో సుబ్బారావుతో పాటు అత‌డి అనుచ‌రుల‌ను రైల్వే కోర్టు నుంచి చంచ‌ల్‌గూడ జైలు కు త‌ర‌లించారు పోలీసులు.

రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు..

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవుల సుబ్బారావు 2011లో ఆర్మీలో పనిచేశాడని, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ అతడికి బాగా తెలుసని పోలీసులు తెలిపారు. 2014లో సాయిడిఫెన్స్‌ అకాడమీ ప్రారంభించిన సుబ్బారావు, ఆర్మీలో సెలెక్ట్‌ అయిన తర్వాత ఉద్యోగుల దగ్గర రూ.3 లక్షలు వసూలుచేసేవాడ‌న్నారు

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు ఎక్కడ జరిగినా ఆవుల సుబ్బారావు హాజరయ్యేవాడు. ఫిజికల్ టెస్ట్ జరిగే దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్‌ల‌లో తన స‌హాయ‌కుల‌ను ఉంచేవాడు. ఎవరైతే ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో అతని సహాయకులు వారిని పట్టుకుని తమ ఫంక్షన్ హాల్‌కు తీసుకువస్తారు. వారు మరుసటి రోజు ఉదయం నిర్వహించే వైద్య పరీక్షల గురించి వారికి శిక్షణ ఇస్తారు. అనంత‌రం వారి అకాడమీలో వారి కోచింగ్ ద్వారా ఉద్యోగానికి హామీ ఇస్తారు. కోచింగ్ ప్రారంభించేటప్పుడు అభ్య‌ర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వారు రాత‌ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉద్యోగానికి ఎంపికైనా అనంత‌రం అభ్య‌ర్థుల నుంచి రూ.3ల‌క్ష‌లు వ‌సూలు చేసేవాడు. ఈ విధంగా బారీగానే ఆర్జించాడు.

2019లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరిగాయి. ఫిజికల్ టెస్ట్ ఎంపికైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష కోసం అకాడమీలు కోచింగ్ ఇచ్చాయి. కొవిడ్‌-19 కారణంగా పరీక్ష జ‌ర‌గ‌లేదు. చాలా సార్లు వాయిదా ప‌డ్డాయి. ఇక ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ స్కీమ్‌ను తీసుకువ‌చ్చింది. రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్రాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

అప్పటికే.. రైల్వేస్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్‌ గ్రూప్‌, చలో సికింద్రాబాద్‌ ఏఆర్‌వో గ్రూప్‌, ఆర్మీ జీడీ 2021 మార్చ్‌ ర్యాలీ, సీఈఈ సోల్జర్‌ గ్రూప్‌, సోల్జర్స్‌ టు డై పేరిట గ్రూపులు పెట్టాడు. బీహార్‌లో జరిగినట్టుగానే రైళ్లను తగలబెట్టాలని ఆయా గ్రూపుల్లో సూచించాడు. సుబ్బారావు తరపున అతడి అనుచరుడు శివ నిత్యం అభ్యర్ధులతో టచ్‌లో ఉన్నాడు. ఈనెల 16న సాయంత్రమే సుబ్బారావు హైదరాబాద్‌ చేరుకున్నాడు. అల్లర్ల కోసం రూ.35 వేలు ఖర్చు చేశాడు. అభ్యర్థులను కూడా అతడే తరలించాడు. ఎనిమిది ఫంక్షన్‌ హాళ్లలో వారికి మకాం ఏర్పాటు చేశాడు. విధ్వంసాన్ని సుబ్బారావు అనుచరుడు బీసీ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించాడు. మరో అనుచరుడు శివ ద్వారా రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి ఆదేశించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Next Story