విషాదం.. ఆడుకుంటూ ఉండగా పెన్ను గుచ్చుకుని బాలిక మృతి
చిన్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 8:15 AM ISTవిషాదం.. ఆడుకుంటూ ఉండగా పెన్ను గుచ్చుకుని బాలిక మృతి
చిన్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతుంటారు. తెలియకుండా చేసే పనుల వల్ల గాయాలపాలవుతుంటారు. కొన్ని సంఘటనల్లో ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఉండగా పెన్ను తలలో గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక ఆస్పత్రి పాలైంది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుభాష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటోన్న దంపతులకు రియాన్షిక అనే నాలుగేళ్ల కూతురు ఉంది. స్థానికంగా ఓ స్కూల్‌లో యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని ఉన్న బాలిక పెన్నుతో ఆడుకుంటూ ఉంది. అకస్మాత్తుగా బెడ్‌పై నుంచి కింద పడిపోయింది. దాంతో.. ఆమె చేతిలో ఉన్న పెన్ను చెవి పైభాగంలోని కణతలో గుచ్చుకుంది. దాంతో.. స్పృహ లేకుండా పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆపరేషన్ తర్వాత పెన్నును తొలగించారు వైద్యులు. అయితే.. పరిస్థితి విషమించి చిన్నారి చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయింది. పాప మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు