మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలుపనుంది. అటు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. ఏపీలో కూడా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు సెలవు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారని, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రంలోనూ హాలిడే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసి మన్మోహన్‌కు నివాళి ఇవ్వాలని పోస్టులు చేస్తున్నారు.
10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా చేసిన మన్మోహన్ తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ప్లాట్లు, మారుతి 800 కారు, ఎస్‌బీఐ, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.