టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు అరెస్ట్‌.. భ‌గ్గుమంటున్న శ్రేణులు

Former Minister Ayyanna Patrudu arrested.మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 7:50 AM IST
టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు అరెస్ట్‌.. భ‌గ్గుమంటున్న శ్రేణులు

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్ల‌వారుజామున పెద్ద సంఖ్య‌లో పోలీసులు అయ్య‌న్న ఇంటికి చేరుకున్నారు. నోటీసులు ఇచ్చి అయ్య‌న్న‌ను అరెస్ట్ చేశారు. ఆయ‌న కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని, ఈ మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ప‌లు నాన్ బెయిల‌బుల్ సెక్షన్ల‌ కింద కేసు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్య‌న్న‌ను హాజ‌రుప‌రుస్తామ‌ని పోలీసులు చెప్పారు.

అయితే.. సీఐడీ పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దొంగల్లా గోడ దూకి వచ్చి, తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. క‌నీసం బ‌ట్ట‌లు కూడా మార్చుకోనివ్వ‌లేద‌న్నారు. గ‌త మూడేళ్లుగా త‌న కుటుంబాన్ని ఏదో ఒక విధంగా వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్నారు. త‌న భ‌ర్త‌, కుమారుడికి ప్రాణ‌హాని ఉంద‌న్నారు. వారికి ఏదైన జ‌రిగితే అందుకు ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

ఇదిలా ఉంటే.. అయ్య‌న్న అరెస్టుకు నిర‌స‌న‌గా న‌ర్సీప‌ట్నంలో తెలుగు దేశం శ్రేణులు ర్యాలీ నిర్వ‌హించాయి. శ్రీక‌న్య సెంట‌ర్ నుంచి ఆస్ప‌త్రి వ‌ర‌కు ర్యాలీ జ‌రిగింది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.

అయ్య‌న్న అరెస్ట్‌ను ఖండించిన చంద్ర‌బాబు

అయ్య‌న్న పాత్రుడిని అరెస్ట్ చేయ‌డాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఖండించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.

చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Next Story