Telangana:'పోలీసులు వేధిస్తున్నారు'.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

సిద్దిపేట, మెదక్ పోలీసుల వేధింపులపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మరో ముగ్గురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2023 9:40 AM IST
Former Congress MLA, Telangana High Court,  harassment, Siddipet, Medak police, Tumkunta Narsa reddy

Telangana:'పోలీసులు వేధిస్తున్నారు'.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్: సిద్దిపేట, మెదక్ పోలీసుల వేధింపులపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ పోలీస్‌స్టేషన్‌లకు చెందిన పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను ఏదో ఒక సాకుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మరో ముగ్గురు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డితో కూడిన సింగిల్‌ జడ్జి బెంచ్‌ విచారించింది.

సెక్షన్ 41A Cr.PC కింద నోటీసులు జారీ చేయకుండా, ఖాళీ కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని వారు తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాది మీర్జా అజరుల్లా బేగ్‌ కోర్టుకు తెలియజేసారు. ముఖ్యంగా సిద్దిపేట సీపీ, గజ్వేల్‌ ఏసీపీ, ఎస్‌హెచ్‌వో గజ్వేల్‌ పీఎస్‌, ఎస్‌హెచ్‌వో గౌరారం పీఎస్‌, ఎస్‌హెచ్‌వో జగదేవ్‌పూర్‌ పీఎస్‌, ఎస్‌హెచ్‌వో మర్కూక్‌ పీఎస్‌, ఎస్‌హెచ్‌వో ములుగు పీఎస్‌, ఎస్‌హెచ్‌వో కుకునూర్‌పల్లి పీఎస్‌, ఎస్‌హెచ్‌ఓ సిద్దిపేట, ఎస్‌హెచ్‌వో తూప్రాన్‌ పీఎస్‌, ఎస్‌హెచ్‌వో మనోహరాబాద్‌ పీఎస్‌లు వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి అక్రమంగా నిర్భందించి ముద్రించిన ఫారాలు, బాండ్లపై చట్టబద్ధత పాటించకుండా సంతకాలు తీసుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించడంతోపాటు సహజ న్యాయ సూత్రాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని బేగ్ ఆరోపించారు. పోలీసు చర్య Cr.PCలోని సెక్షన్ 106,107,108,109, 111, 116లను కూడా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు, ముందస్తు షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా, ఇతర ఉత్తర్వులను జారీ చేయడం ద్వారా Cr.PC యొక్క చాప్టర్ VIIIలో సూచించిన విధానాన్ని అనుసరించాలని SHOలను ఆదేశించాలని కోరారు.

సెక్షన్ 41A Cr Pc కింద నోటీసు జారీ చేసిన తర్వాత, ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదైన వ్యక్తులను మాత్రమే పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలుస్తున్నారని ప్రత్యేక GP ముజీబ్ కుమార్ సదాశివుని కోర్టుకు తెలియజేశారు. కార్యకర్తలను బలవంతంగా పీఎస్‌కు పిలిపిస్తున్నారని పిటిషనర్‌తోపాటు మరికొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి, ఎన్నికల సమయంలో కేసులు నమోదైన వారందరినీ కట్టడి చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు. పిటిషనర్లను పోలీసు స్టేషన్‌లకు విచారణకు పిలిపించకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. తదుపరి ఉత్తర్వుల కోసం డివిజన్ బెంచ్ ముందు రిట్ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీ, హైకోర్టును ఆయన ఆదేశించారు. డివిజన్ బెంచ్ ఒకటి రెండు రోజుల్లో దీనిపై విచారణ చేపట్టవచ్చు.

Next Story