హైదరాబాద్‌లోని శివారు ప్రాంత ప్రజలకు కంటి మీద కునును లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలోని వ్యాస్ నగర్ గ్రే హౌండ్స్ లో ఇటీవల కొన్ని రోజుల క్రితం చిరుత కనిపించిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అదే చిరుత గోల్కొండ సమీపంలో రోడ్డు దాటుతూ సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైన విషయం విధితమే.
గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్ ప్రాంతాల్లో చిరుత సంచరించింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు 14 ట్రాప్ కెమెరాలు, అదే విధంగా మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు అంచనాకు వచ్చి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిరుతను ట్రెక్ పార్కులోని గేటు వద్ద అధికారులు బోనులో బంధించినట్లు వెల్లడించారు.