వికటించిన మధ్యాహ్నా భోజనం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
Food poison in Kamareddy district.మధ్యాహ్నా భోజనం వికటించి 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2021 12:41 PM ISTమధ్యాహ్నా భోజనం వికటించి 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బీర్కూర్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నాం ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. వీరికి మధ్యాహ్నా భోజన సమయంలో అన్నం, పప్పుచారు, గుడ్డుతో భోజనం పెట్టారు. మధ్యాహ్నాం మూడు గంటల తరువాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రారంభమైంది.
వెంటనే ఉపాధ్యాయులు పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం అందించగా.. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించారు. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చారు. విద్యార్థులను అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారని తహసీల్దార్ రాజు తెలిపారు. మధ్యాహ్నా భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు గుర్తించారు.
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్ పోచారం
ఈ ఘటనపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా బాధాకరమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.