చేపల లారీ బోల్తా.. నిమిషాల్లో చేపలు మాయం
Fish Lorry overturns in Kothagudem District.సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదంలో గాయపడిన
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 12:42 PM ISTసాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటారు స్థానికులు. అయితే.. ఇది అన్ని వేళలా కాదు అనేది కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంటుంది. బీర్లు, సెల్‌ఫోన్లు, ఇంకా ఏవైనా వస్తువులు తీసుకువెలుతున్న వాహనం ప్రమాదానికి గురైతే మాత్రం ఆ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించే బదులు కొందరు వాటిని తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బూర్గంపాడు మండలం ఐటిసి క్రాస్ రోడ్డు వద్ద చేపల లోడుతో వెలుతున్న లారీ ఈరోజు(మంగళవారం) ఉదయం బోల్తా కొట్టింది. దీంతో లారీలోని చేపలు రోడ్డుపై పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. అందినకాడికి చేపలను ఎత్తుకెళ్లారు. కొందరైతే ఏకంగా బస్తాలతో చేపలను పట్టుకుపోయారు. చేపల కోసం జనం పెద్ద ఎత్తున తరలిరాడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ జామ్ అవుతుందని వారించినా.. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒక్కో చేప దాదాపు 2 కేజీల బరువు ఉండగా.. సుమారు 4 వేల చేపలను అరగంటలో ఖాళీ చేశారు. ఆంద్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెలుతుండగా లారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలైయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.