కరీంనగర్‌: బావిలో పడ్డ వృద్ధురాలు.. కాపాడిన ఫైర్‌ సిబ్బంది

Fire and Rescue personnel rescue 80-year-old woman from well in Karimnagar

By అంజి
Published on : 21 Feb 2023 12:45 PM IST

కరీంనగర్‌: బావిలో పడ్డ వృద్ధురాలు.. కాపాడిన ఫైర్‌ సిబ్బంది

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం బావిలో నుండి 80 ఏళ్ల వృద్ధురాలిని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది రక్షించారు. మానకొండూర్‌లోని సంజీవ్‌నగర్‌కు చెందిన మాధవమ్మ ఉదయం ప్రమాదవశాత్తు తన ఇంటి ఆవరణలోని ఇంటి బావిలో పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఉదయం 6.10 గంటల ప్రాంతంలో బాధితురాలి కుమారుడు రవీందర్ నుంచి ఫోన్ రావడంతో మానకొండూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లీడింగ్ ఫైర్‌మెన్ జి ధర్ము బావిలోకి దిగి కుర్చీ ఆకారంలో ఉన్న తాడుతో మహిళను బావిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎలాంటి గాయాలు లేకుండా విజయవంతంగా ఆమెను కాపాడారు. ఫైర్‌ సిబ్బంది రెస్క్యూతో వృద్ధురాలి ప్రాణాలు నిలిచాయి. వృద్ధురాలను కాపాడి తమకు అప్పగించినందుకు అగ్నిమాపక సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించిన మానకొండూరు అగ్నిమాపక యూనిట్ సిబ్బందిని జిల్లా అగ్నిమాపక అధికారి టి.వెంకన్న, గ్రామస్తులు అభినందించారు.


Next Story