రాజేంద్రనగర్: బాణసంచా దుకాణంలో మంటలు, దగ్ధమైన షాపులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  11 Nov 2023 3:00 AM GMT
fire accident, crackers shop, rajendranagar ,

 రాజేంద్రనగర్: బాణసంచా దుకాణంలో మంటలు, దగ్ధమైన షాపులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడ జాగర్‌ కార్పొరేషన్ పరిధిలోని సన్‌ సిటీ వద్ద ఉన్న క్రాకర్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీపావళి కావడంతో బాణసంచా సరుకు దుకాణంలో ఎక్కువగా ఉంది. దాంతో.. పటాకులు పేలి మంటలు మరింతగా చెలరేగాయి. దాంతో.. పక్కనే ఉన్న ఓ ఫుడ్‌ కోర్టుకు మంటలు అంటుకున్నాయి. ఫుడ్‌ కోర్టులో ఉన్న సిలిండర్‌ మంటల ధాటికి ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందని తెలుసుకునే లోపే మంటలు శరవేగంగా వ్యాపించాయి.

స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా పక్కపక్కనే ఉన్న మూడు షాపులు మంటలకు దగ్ధం అయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే.. పక్కనే ఉన్న షాపుల్లో జనాలు ఉన్న మంటలను చూసి అప్రమత్తమై అక్కడి నుంచి బయటకు వెళ్లారు. అనుమతి లేకుండా క్రాకర్స్‌ దుకాణం ఏర్పాటు చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేశామని.. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు.

ఇక హైదరాబాద్‌లోని గోశామహల్‌లో ఓ ఫ్లైవుడ్‌ గోదాంలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. గోశామహల్ దారుసలం, గౌస్పురా లోని బాలాజీ ప్లైఉడ్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్కుట్ తో చెలరేగిన మంటలుగా అనుమానిస్తున్న ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్ల తో మంటలు అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.

Next Story