ఆర్థిక సంవత్సరం 2024 - 25కి గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్‌బాబు నిర్వహిస్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం రూ.280 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
అయితే ఈ బడ్జెట్‌లో అత్యధిక భాగం వ్యవసాయ శాఖకే కేటాయించనున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15 వేల కోట్లతో కలిపి ఆ మొత్తం దాదాపు రూ. 50 వేల కోట్ల ఉండొచ్చు. సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, సాగునీటి పారుదలకు రూ.29 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక విద్యుత్ శాఖ, వైద్య శాఖలకు చెరో రూ.15 వేల కోట్లు, గృహ నిర్మాణ శాఖకు రూ.8 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ.2.75 లక్షల కోట్లు.