Video: కాంగ్రెస్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్‌

గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్‌ వివాదం తలెత్తింది.

By -  అంజి
Published on : 21 Jan 2026 11:09 AM IST

Congress MP Mallu Ravi, BRS MLA Vijayudu, foundation stone laying, development works, Gadwal, vaddepalli

Video: కాంగ్రెస్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్‌

హైదరాబాద్‌: గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్‌ వివాదం తలెత్తింది. అభివృద్ధి పనుల శంకుస్థాపన సమయంలో కొబ్బరి కాయలు కొట్టేందుకు తాము ముందు అంటే తాము ముందని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఎంపీ, ఎమ్మెల్యే ఒకరినొకరు తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో పోలీసులు కలగజేసుకుని శాంతింపజేశారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం స్పందించింది. అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగుతూ తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించింది. అధికార అండతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను బయటపెట్టినందుకు.. ఓర్వలేక ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై ఎంపీ మల్లు రవి రెచ్చిపోయి దాడి చేయడం సిగ్గుచేటని అంది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడితే సమాధానం చెప్పలేక దాడులకు దిగడమేనా మీ 'ప్రజాపాలన'? అక్రమాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించింది.

అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్ధం అవుతుందోన్నారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు.

Next Story