వైరల్‌ అవుతోన్న లేఖకు..ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి సంబంధం లేదు:CPRO

దక్షిణ మధ్య రైల్వేకు వచ్చిన బెదిరింపు లేఖకు.. ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి సంబంధం లేదని సీపీఆర్వో అన్నారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2023 2:41 PM IST
Falaknuma Train, Fire, CPRO Rakesh, threatening letter,

వైరల్‌ అవుతోన్న లేఖకు..ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి సంబంధం లేదు:CPRO

హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తోన్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రైల్‌లో మంటల వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. అయితే.. మంటలను గమనించి ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఓ వ్యక్తి మంటలను గమనించి ట్రైన్‌ లాగాడు. రైలు నిలిచిపోయింది. దీంతో మంటలు చెలరేగాయని చెప్పడంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగారు. ఇక తర్వాత క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. చైన్‌ లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి గురయ్యాక ఓ లెటర్‌ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అది దక్షిణమధ్య రైల్వేకు దుండగులు రాసిన బెదిరింపు లెటర్. బాలాసోర్‌లో జరిగిన రైలు దుర్ఘటన తరహాలో.. హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్‌ రూట్‌లో దాడికి పాల్పడతామని పాల్పడతామని హెచ్చరించారు. లెటర్ గురించి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు. వారం రోజుల కిందటే ఈ లెటర్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లలోని గోడపై లెటర్‌ను అతికించారని పోలీసులు చెప్తున్నారు. ఎవరు అంటించారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

ఆగంతకులు రాసిన లెటర్‌పై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ స్పందించారు. ఫలక్‌నుమా రైలులో ప్రమాదానికి గల కారణాలను విచారణ తర్వాతే చెప్పలగలమని అన్నారు. ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖకు.. ఈ ప్రమాదానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే.. లేఖపై మాత్రం దర్యాప్తు జరుపుతున్నట్లు సీపీఆర్‌వో రాకేశ్‌ చెప్పారు. పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్‌ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపూర్‌ రైళ్లు విజయవాడ మీదుగా మళ్లించారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా రైల్‌లో మంటలు చెలరేగడంతో కొన్ని బోగీలు కాలిపోయాయి. ట్రాక్‌ క్లియరెన్స్‌ కోసం ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రమాదానికి కారణం సిగరెట్‌ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ట్రైన్‌లో ప్రయాణించిన కొందరు ఈ విషయం చెబుతున్నారు. చార్జింగ్‌ పాయింట్‌వద్ద ఓ వ్యక్తి సిగరెట్‌ తాగడంతో విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పూర్తి స్థాయి విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలియనున్నాయి.

Next Story