వ‌రంగ‌ల్‌లో దారుణం.. యూట్యూబ్‌లో చూస్తూ అబార్ష‌న్లు.. ఓ మెడిక‌ల్ రిప్ర‌జెంటేటివ్ ఘ‌న‌కార్యం

Fake doctor arrested in warangal.మెడిక‌ల్ రిప్ర‌జెంటేటివ్ ప‌నిచేస్తున్నాడు. అయితే.. ఆ సంపాద‌న స‌రిపోవ‌డం లేద‌ని ఏకంగా ఎంబీబీఎస్ డాక్ట‌రుగా అవ‌తారం ఎత్తాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2021 10:20 AM IST
Fake doctor arrested in Warangal

అత‌డు చ‌దివింది బీఎస్సీ. మెడిక‌ల్ రిప్ర‌జెంటేటివ్ ప‌నిచేస్తున్నాడు. అయితే.. ఆ సంపాద‌న స‌రిపోవ‌డం లేద‌ని ఏకంగా ఎంబీబీఎస్ డాక్ట‌రుగా అవ‌తారం ఎత్తాడు. వ‌రంగ‌ల్ న‌గ‌రం న‌డిబొడ్డున ఓ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేశాడు. త‌న‌కున్న ప‌రిచ‌యాల సాయంతో రెండోసారి ఆడ‌పిల్ల‌లు వ‌ద్దుకుంటున్న మ‌హిళ‌ల‌కు యూట్యూబ్‌లో చూస్తూ అబార్ష‌న్లు చేస్తూ ఆ మ‌హిళ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతున్నాడు. విష‌యం తెలిసిన పోలీసులు ఆ ఆస్ప‌త్రిని సీజ్ చేసి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల మేర‌కు.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి (38) బీఎస్సీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు.

నెల రోజుల క్రితం హన్మకొండ ఏకశిల పార్క్ ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరిట ఓ ఆసుపత్రిని ప్రారంభించాడు. రెండోసారి ఆడపిల్ల పుట్టే అవకాశం ఉన్న మహిళలను ఆర్ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తాడు. అలా వచ్చిన మహిళలకు నర్సింగులో శిక్షణ పొందినవారితో యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేయిస్తున్నాడు. దీనిపై స‌మాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధ‌వారం అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడిచేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళకు చికిత్స చేస్తున్న సిబ్బంది అధికారులను చూసి గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూములో దాచిపెట్టారు.

ఆమెను గుర్తించిన పోలీసులు బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఆ మ‌హిళ‌కు ర‌క్త‌స్రావం అవుతుండ‌డంతో వెంట‌నే ఆమెను హ‌న్మ‌కొండ జీఎంహెచ్‌కు త‌ర‌లించారు. అనంత‌రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అత‌డు మూడేళ్ల క్రితం వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లోనూ ఇలాగే ఓ ఆస్ప‌త్రి ఏర్పాటు చేయ‌గా దాన్ని అప్ప‌ట్లోనే పోలీసులు సీజ్ చేశారు.


Next Story