తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్‌తో లబ్ధిదారుల గుర్తింపు
ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By - అంజి |
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్‌తో లబ్ధిదారుల గుర్తింపు
హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
శాఖల వారీగా 10 వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సూచించారు.
గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి. వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి. ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలి. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగాం. సాంకేతికతను సరిగా వినియోగించుకోలేక ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారు. “రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వండి. ఆ అధికారి తప్పనిసరిగా పాఠశాలలో భోజనం చేయాల్సిందే. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలి” అని చెప్పారు.
విద్యా సంవత్సరం తొలి రోజున జూన్ 12న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి. విద్యా శాఖ అధికారులు ఇప్పట్నుంచే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం సహించబోం. వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. ఏటా సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీకి దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు పెడుతోంది. భవిష్యత్‌లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్‌ను అనుసంధానం చేయాలని భావిస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదే. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. అలాగే, ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగులుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నారని గుర్తించాం. వాటన్నింటిపైనా ఆడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలి. భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలి. అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలి. ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలుండాలి. వివిధ ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం తమ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.