సీఎం రేవంత్‌ ఆఫర్‌ను తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని

మాజీ డీఎస్పీ నళిని తెరపైకి వచ్చారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

By Srikanth Gundamalla  Published on  17 Dec 2023 5:09 AM GMT
ex police officer, nalini, reject, cm revanth reddy, offer,

సీఎం రేవంత్‌ ఆఫర్‌ను తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని

తెలంగాణ ఉద్యమం ఎంతో ఉధృతంగా కొనసాగింది. ఈ పోరాటంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యారనే చెప్పాలి. ప్రాణాలను అర్పించి తెలంగాణ అమరులుగా మిగిలిపోయారు. ఇక కొందరు రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అందులో ఒకరే మాజీ డీఎస్పీ నళిని. ఇప్పుడు మరోసారి మాజీ డీఎస్పీ నళిని తెరపైకి వచ్చారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా చాలా మంది సోషల్‌ మీడియా యూజర్లు నళినికి ఉద్యోగం తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

ఇదే విషయంలో స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చించారు. మాజీ డీఎస్పీ నళినికి పోలీస్‌ శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఒక వేళ ఉంటే ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మార్గదర్శకాలకు అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి వారికి సూచించారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆఫర్‌పై స్పందించిన మాజీ డీఎస్పీ నళిని దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈమేరకు వివరణ ఇస్తూ.. సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. తనపై చూపిస్తున్న అభిమానానికి గాను రేవంత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు ఒక సస్పెండ్‌ ఆఫీసర్‌ అనే మరకను మోశానని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న తాను చేసిన రాజీనామా సంచలనం రేకెత్తించిందని గుర్తు చేశారు నళిని. ఉద్యమంలో తాను నిర్వహించిన కీలకమైన పాత్ర ప్రజలకు దగ్గర చేసిందని చెప్పారు. కానీ తన బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ తనని వెలివేశారని అన్నారు. ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయానని అన్నారు. తీవ్ర ఇబ్బందులు పడ్డానని చెప్పారు నళిని.

అయితే.. రెండేళ్ల క్రితం దేవుడి దయ వల్ల తన జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేవించారని నళిని చెప్పారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానని నళిని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. కాబట్టి తన పంథా మర్చుకొలేననీ.. సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను అని చెప్పారు. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను అనీ... అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదన్నారు. ఉద్యోగానికి బదులు తన ధర్మ ప్రచారానికి ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళిని తెలిపారు.


Next Story