మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నేత కుంజా బొజ్జి(95) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. భద్రాచలంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయన ఏజెన్సీలో నిరుపేదల, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం, తునికాకు కార్మికుల కూలీ పెంపు కోసం పలు ఉద్యమాలు చేపట్టారు. పార్టీ అభివఅద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసిన కుంజా బొజ్జిని ఏజెన్సీ సుందరయ్యగా పిలుచుకుంటారు. కుంజా బొజ్జి భార్య లచ్చమ్మ మూడేళ్ల క్రితం మరణించారు. వారికి ఆరుగురు సంతానం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్న గూడెం కుంజా బొజ్జి స్వగ్రామం. 1985లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం టిడిపి మద్దతుతో పోటీ చేసిన ఆయన 1989, 94లలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ నేతగా గుర్తింపు పొందారు. బుజ్జి మరణవార్త తెలిసిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించారు.