ఈటల వర్సెస్ గంగుల.. రచ్చ తారాస్థాయికి చేరుకోబోతోంది
Etela Rajender Vs Gangula Kamalakar. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడంతో ఫైర్ బ్రాండ్ గంగుల కమలాకర్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపింది.
By Medi Samrat
ఈటల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడంతో ఫైర్ బ్రాండ్ గంగుల కమలాకర్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండేవాడని గంగుల కమలాకర్ కొద్దిరోజుల కిందట ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈటల రాజేందర్ ను ఎంతో గౌరవించిందని.. 20 సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్నాడని గంగుల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. అబద్దాలతో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ.. ఆత్మగౌరవమంటూ మాజీమంత్రి ఈటల రాజేందర్ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు.
గంగుల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ ఇచ్చారు. 'బిడ్డా గంగులా' అంటూ ఈటల రెచ్చిపోయారు. అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో.. కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావు.. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని... నీలాంటి చరిత్ర తనది కాదని తీవ్ర విమర్శలు చేశారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు?.. నీ కథ మొత్తం తనకు తెలుసని... సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని అన్నారు. అంతేకాకుండా 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈటల వ్యాఖ్యలకు గంగుల కమలాకర్ స్పందించారు. ఏం బెదిరిస్తున్నవా ఈటల రాజేందర్? నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరేటోడు ఎవ్వడు లేడు.. బిడ్డా..బిడ్డా అని బెదిరిస్తే అంతకన్నా ఎక్కువ మాట్లాడుతా. నేనూ బీసీ బిడ్డనే. నీ కన్నా నాకు ఆత్మగౌరవం ఎక్కువ అని గంగుల కమలాకర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా పోతే తానూ వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుందని, దానిని తట్టుకోలేవని, అది చాలా భయంకరంగా ఉంటుందని ఈటలను హెచ్చరించారు.
నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. అసైన్డ్ భూములు, దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంలో ఈటల తప్పు చేశారని అధికారులు తేల్చారని గంగుల చెప్పారు. నిజంగా ఆత్మగౌరవం ఉండి ఉంటే ఆ భూములన్నింటినీ ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని సవాల్ విసిరారు. 1992 నుంచి చట్టబద్ధంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని గంగుల చెప్పారు. ఈటలలాగా అసైన్డ్ భూములు కొని గోడౌన్లు కట్టి మద్యం షాపులకు ఇవ్వలేదన్నారు. తాను పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే దానికి ఐదింతలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అధికారుల కమిటీ వేసి విచారణ చేయించేందుకు తాను సిద్ధమని, విచారణలో తప్పు చేశానని తేలితే దేనికైనా సిద్ధమని అన్నారు. తాను ఓడిపోతానని ఈటల రాజేందర్ ప్రచారం చేశాడని, కానీ, తాను గెలిచేటప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు.