బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. నేను చెప్పినందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడితే మునుగోడు సమస్యలు పరిష్కారమవ్వవని, రాజీనామా చేస్తే ప్రజలకు కావాల్సినవి అన్నీ వస్తాయని చెప్పినట్లుగా గుర్తు చేశారు. తన మాటలను నమ్మే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసారని ఆయన వివరించారు. తెలంగాణాలో బెల్ట్ షాప్ లు విచ్చల విడిగా వెలిశాయని ఆరోపించారు. బెల్ట్ షాప్ ల కారణంగా మహిళలు చిన్న వయసులోనే భర్తను కోల్పోతున్నారని మండిపడ్డారు. మద్యం మీద వచ్చే ఆదాయంపై ప్రభుత్వము ఆధారపడటం దురదృష్టకరమని, అలాంటి తెలంగాణ తెలంగాణ ప్రజలు కోరుకోవడంలేదని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసిఆర్ కు 20 ఏళ్ళు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్ పై కేసిఆర్ కేసులు పెట్టారని అన్నారు. ఆయనను హుజూరాబాద్ ప్రజలు గెలిపించారు. ఈటల రాజేందర్ ఇచ్చిన ధైర్యంతోనే రాజీనామా చేశాను, డబ్బుల కోసం 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్ పార్టీలోకి మారారు కానీ నేను మారలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పేదలకు వైద్యం అందడం లేదని విమర్శించారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలబడాలని కోరారు.