వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్‌ను దెబ్బకొట్టేలా బీజేపీ భారీ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఈ విషయమై పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పినట్లు మాటామంతి కార్యక్రమంలో ఈటల వెల్లడించారు. ఇందుకోసం గజ్వేల్‌లో సీరియస్‌గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెస్ట్ బెంగాల్‌లోని సువేందు అధికారి సీన్ రాష్ట్రంలో రిపీట్ అవుతుందన్నారు. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీలాగా ఇక్కడ సీఎంని ఓడగొట్టాలన్నారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం కేసీఆర్ గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా లేదా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.